యూఏఈ : దుబాయ్‌లో వరదలా , ‘‘ క్లౌడ్ సీడింగ్ ’’ అంత పని చేసిందా ..?

 



ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్ధితులు అనూహ్యం మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అంతుచిక్కడం లేదు. చల్లగా వుండే ప్రదేశాల్లో భానుడు నిప్పులు కక్కుతుండగా.. 365 రోజులూ ఎండ వేడితో అల్లాడిపోయే ప్రాంతాల్లో భీకర తుఫాన్లు, వరదలు చోటు చేసుకుంటున్నాయి. 

ప్రస్తుతం ఎడారి దేశమైన యూఏఈ భారీవర్షాలు, వరదలతో అల్లాడిపోతోంది. ముఖ్యంగా ఆ దేశ వాణిజ్య రాజధాని, ప్రపంచ ప్రఖ్యాత నగరం దుబాయ్‌లో వర్షాలు, వరదలు పోటెత్తుతున్నాయి. మంగళవారం బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. దుబాయ్ నగరంలో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లో కురిసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దుబాయ్‌లో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. 

కొన్నేళ్లుగా తడిసిముద్దవుతోన్న యూఏఈ :

వరదల ధాటికి ప్రధాన రహదారిలో కొంత భాగం కొట్టుకుపోగా.. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా వుండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్‌పోర్ట్ రన్ వే పైకి భారీగా నీరు చేరింది. దీంతో అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. 

రాతి నేలలు, మైదానాల కలయికతో వుండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ స్థాయి వరదలు చాలా అరుదు. కానీ గడిచిన కొన్నేళ్లుగా యూఏఈలో ఇలా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగానే ఈ పరిస్ధితులు చోటు చేసుకున్నట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు. 

పెరుగుతున్న అవసరాలతోనే క్లౌడ్ సీడింగ్ దిశగా :

కాగా.. యూఏఈలో ఈ స్థాయి వర్షాల వెనుక ‘‘క్లౌడ్ సీడింగ్ ’’ పేరు వినిపిస్తోంది. అంటే మానవ ప్రమేయం ద్వారా వర్షాన్ని కురిపించడం. భూగర్భ జలాలపై ఒత్తిడి, పెరుగుతున్న జనాభా అవసరాలను అధిగమించేందుకు గాను యూఏఈ ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ పద్ధతిని అమలు చేస్తోంది. ఈ విధానాన్ని 1982వ దశకంలోనే ఈ దేశం టెస్ట్ చేసింది. తర్వాతి రోజుల్లో అమెరికా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన సాంకేతిక నిపుణుల సాయంతో 2000వ సంవత్సరంలో క్లౌడ్ సీడింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

భారత్‌లోనూ క్లౌడ్ సీడింగ్ :

ఎమిరేట్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ, యూఏఈ రెయిన్ ఎన్‌హాన్స్‌మెంట్ ప్రోగ్రాంలు సంయుక్తంగా ఈ క్లౌడ్ సీడింగ్ కార్యక్రమాన్ని చేపడుతోంది. యూఏఈతో పాటు దాని పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, ఒమన్‌లు సైతం ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. 

Also Read : దూసుకెళ్తోన్న " వందే భారత్‌‌ ఎక్స్‌ప్రెస్ " .. ఏకంగా 2 కోట్ల మంది ప్రయాణం ..!!

మనదేశంలోనూ కరువు ప్రభావిత ప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ ప్రయత్నాలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం నుంచి రక్షించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్‌‌ను అనుసరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం 12 జిల్లాల్లో మేఘమథనం కార్యక్రమం నిర్వహించింది. 

అసలేంటీ క్లౌడ్ సీడింగ్ : 

వాతావరణంలో మానవ ప్రయత్నం ద్వారా మార్పులు తీసుకొచ్చి కృత్రిమంగా వర్షాలు కురిపించడాన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు. సిల్వర్ అయోడైడ్, పోటాషియం అయోడైడ్ వంటి లవణాల్ని విమానంలో తీసుకెళ్లి మేఘాలపై జల్లుతారు. దీంతో మబ్బులు కరిగి వర్షం కురుస్తుంది. కానీ దీని వల్ల పర్యావరణానికి ప్రమాదం పొంచి వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

ఒకే ప్రాంతంలో వర్షాలను కురిపించాలంటే మరో చోట కరువు తప్పదని , సహజ వనరులు, ప్రకృతి విషయంలో జోక్యం చేసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే క్లౌడ్ సీడింగ్ కోసం సిల్వర్ ఆయోడైడ్ తరహా హానికర రసాయనాలకు దూరంగా వుంటోంది యూఏఈ. దీనికి బదులుగా సాధారణ లవణాలు, టైటానియం ఆక్సైడ్ పూత కలిగిన ఉప్పుతో నానో మెటీరియల్‌ను ఈ దేశం అభివృద్ధి చేసింది. 

Also Read : 'ప్రతీకారం' తప్పదు .. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగిన ఇరాన్ సుప్రీం లీడర్ , ఎవరీ అయతుల్లా అలీ ఖమేనీ ..?

క్లౌడ్ సీడింగ్ ద్వారా కురిసిన వర్షాన్ని ఎడారి దేశాలు అత్యంత జాగ్రత్తగా ఒడిసిపడుతున్నాయి. ఇందుకోసం పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించి, ఈ వర్షపు నీరు సముద్రంలో కలవకుండా తిరిగి డ్యామ్‌ల్లోకి చేర్చుతున్నారు. ఇటీవలి కాలంలో డ్యామ్‌ల నిర్మాణం విపరీతంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. 


Comments